

పశ్చిమ దిల్లీలోని తిలక్ నగర్‌లో రోడ్డు తనిఖీ సందర్భంగా ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ ఓ యువకుడిపై చేయిచేసుకున్నారంటూ వివాదం చెలరేగింది. ఇటీవల నిర్మించిన రోడ్డు నాణ్యతను పరిశీలించేందుకు మంత్రి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ రోడ్డు నాణ్యతపై ప్రశ్నిస్తూ, రోడ్డు పైభాగాన్ని చేత్తో తొలగించి చూపించారు. ఎమ్మెల్యేకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త సాహెబ్ సింగ్ ఈ ఘటనను ఫోన్‌లో రికార్డు చేస్తుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. వైరల్‌గా మారిన వీడియోలో పర్వేశ్ వర్మ అతడి ఫోన్‌ను కిందికి నెట్టి, అనంతరం చెంపపై కొట్టినట్లు కనిపిస్తోంది.
ఈ ఘటనపై పర్వేశ్ వర్మ స్పందిస్తూ.. తన కుటుంబ సభ్యులపై అక్కడున్న ఆప్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే సాహెబ్ సింగ్ తాను ఎలాంటి దూషణలు చేయలేదని, రోడ్డు తనిఖీని రికార్డు చేస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై వికాస్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించిన వాస్తవాలను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆప్ నేతలు విమర్శలు చేయగా, మాజీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వీడియోను షేర్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!