

NEET-UG 2026 పేపర్‌లీక్ కేసులో దర్యాప్తు వేగం పెంచిన సీబీఐ ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసింది. మరో రెండు డజన్ల మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు పలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. అరెస్టయిన వారిలో జైపూర్‌కు చెందిన మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేశ్ బివాల్, గురుగ్రామ్‌కు చెందిన యశ్ యాదవ్, నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నార్ ఉన్నారు. ఈ కేసులో పెద్దల ప్రమేయం ఉందని, సామాన్యులను మాత్రమే వేధిస్తున్నారని ఒక నిందితుడు ఆరోపించడం సంచలనంగా మారింది.
రాజస్థాన్‌లో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌టీఏ దేశవ్యాప్తంగా పరీక్షను రద్దు చేసి 23 లక్షల మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ‘గెస్ పేపర్’ పేరుతో పాస్‌వర్డ్ రక్షణ కలిగిన పీడీఎఫ్ సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. సికార్, ఝుంఝునూ, అల్వర్, జైపూర్ ప్రాంతాల్లో 150 మందికిపైగా విద్యార్థులను విచారించారు. ప్రశ్నపత్రం నాసిక్‌లో ప్రింట్ అయి అక్కడి నుంచే లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి అశోక్‌గహ్లోత్ ఈ కేసులో బీజేపీ నేత ప్రమేయం ఉందని ఆరోపించగా, ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!