

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్నారుల టీకాల సిఫార్సులు, షెడ్యూళ్లలో మార్పులు తీసుకురావాలని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ మార్పుల ప్రకారం పిల్లలకు సిఫార్సు చేసే సాధారణ టీకాల సంఖ్యను తగ్గించి, కొన్ని టీకాలను అందరికీ కాకుండా అధిక ముప్పు ఉన్న పిల్లలకు మాత్రమే సూచించే విధంగా విధానాన్ని మార్చనున్నారు. తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, పోలియో, హిబ్, న్యూమోకోకల్ వ్యాధి, హెచ్‌పీవీ, ఆటలమ్మ వంటి టీకాలు సాధారణ సిఫార్సుల్లో కొనసాగుతుండగా, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బీ, ఆర్‌ఎస్‌వీ, మెనింజోకోకల్ వ్యాధి వంటి టీకాలను పరిస్థితిని బట్టి సూచించే విధానాన్ని ప్రతిపాదించారు.
ట్రంప్ ఆదేశాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం ఎంఎంఆర్ టీకా. ప్రస్తుతం తట్టు, గవదబిళ్లలు, రుబెల్లాకు కలిపి ఒకే టీకాగా ఇస్తున్న ఎంఎంఆర్‌ను మూడు వేర్వేరు టీకాలుగా అందించాలనే ప్రతిపాదన చేశారు. అయితే అమెరికాలో ప్రస్తుతం ఈ మూడు వ్యాధులకు ప్రత్యేక టీకాలు అందుబాటులో లేవని, వాటిని అభివృద్ధి చేసి పరీక్షలు, అనుమతులు పూర్తి చేయడానికి సంవత్సరాలు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. వైద్య నిపుణులు ఈ మార్పులు తల్లిదండ్రుల్లో గందరగోళాన్ని పెంచి, టీకాలపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!