

భూ రికార్డుల నిర్వహణ పోర్టల్ ‘ధరణి’లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను బహిర్గతం చేయాలని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని అడ్డుపెట్టుకుని పేదల భూములను అన్యాక్రాంతం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారాస నేతల పేర్లను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం.. ఆ నివేదికలో ఏం తేలిందో ప్రజలకు చెప్పాలని కోరారు. ధరణి కారణంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని 2023 ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం రైతుల భూములను లాక్కుంటోందని ఆయన విమర్శించారు.
నిషేధిత భూముల జాబితా తగ్గకపోగా మరింత పెరిగిందని, వివాదాలు లేని ప్రైవేట్ భూములను సైతం 22ఎ జాబితాలో చేర్చారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. ఫ్యూచర్‌సిటీలో భూ లావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో నకిలీ ఎన్‌ఓసీలు పొందిన వారిపై చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్, భారాస మధ్య కుమ్మక్కుకు నిదర్శనమని విమర్శించారు. అలాగే ధరణి కుంభకోణంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!