

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 12 కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ కేబినెట్ ప్రత్యేక తీర్మానం చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకానికి రూ.10,208 కోట్లు కేటాయించి 68.05 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించడంతో పాటు.. వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10 శాతం పెంచినట్లు చెప్పారు. విదేశీ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి ఆకర్షించే ఉన్నత విద్యా విధానం-2026కు, విశాఖపట్నం మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం IIT-JEE, NEET కోచింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు, రేపల్లె ఆస్పత్రి విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విధి నిర్వహణలో మృతిచెందిన ఆశా కార్యకర్తలకు రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ అందించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. కొండేపిలో గురుకులానికి 7 ఎకరాలు, ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు.. పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మంత్రుల సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కోసం రూ.20.62 కోట్ల APHIMS ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాజధాని భూముల అంశంపై మంత్రి నారాయణకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. కేటగిరీ-4, ఎండోమెంట్ భూములకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం మరోసారి తన దృష్టికి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!