

భారత్ అభివృద్ధిని, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు చైనా వివిధ వ్యూహాలను అమలు చేస్తోందని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ హెచ్చరించింది. కీలక పారిశ్రామిక ముడిపదార్థాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సేవలపై తనకున్న నియంత్రణను ఉపయోగించుకుంటూ భారత్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచుతోందని పేర్కొంది. అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ 2026 వార్షిక నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. చైనాస్ అదర్ ఫ్రంట్: ఇండియా అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ యూఎస్ స్ట్రాటజీ ఇన్ ద ఇండో-పసిఫిక్ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో.. భారత్-చైనా సరిహద్దుల్లో సైనిక ఒత్తిడి పెంచడంతోపాటు పాకిస్థాన్‌తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంటోందని పేర్కొంది. చైనాతో పోటీపడగల సామర్థ్యం ఉన్న అమెరికా కూటమిలో సభ్యత్వంలేని అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని కమిటీ అభిప్రాయపడింది. చైనాపై ప్రపంచ దేశాల ఆధారపడటాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ సరఫరా, తయారీ వ్యవస్థల అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించగలదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత ఎదుగుదలను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని హెచ్చరించింది.
పాకిస్థాన్‌తో చైనా సైనిక భాగస్వామ్యం పెరుగుతుండటంపై కూడా అమెరికా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు భారత్‌కు రెండు వైపుల నుంచి భద్రతాపరమైన ముప్పును పెంచుతున్నాయని పేర్కొంది. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాక్ మధ్య జరిగిన ఘర్షణలను నివేదిక ప్రస్తావించింది. ఆ సమయంలో చైనా నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చినట్లు పేర్కొంది. ఆపరేషన్ సందర్భంగా పాకిస్థాన్‌కు సాంకేతిక సహకారం అందించిన విషయాన్ని చైనా ఈ ఏడాది తొలిసారిగా అంగీకరించిందని నివేదిక తెలిపింది. చైనా ప్రాంతీయ ఆధిపత్య వ్యూహాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో రక్షణ సహకారాన్ని అమెరికా మరింత విస్తరించాలని కమిటీ సూచించింది. హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రత, నిఘా సామర్థ్యాలను పెంచుకోవడంతోపాటు సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని, చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాముల కదలికలను ఉమ్మడిగా పర్యవేక్షించాలని సిఫారసు చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!