

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు తుది దశకు చేరుకోవడంతో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కఠిన చర్యలు చేపట్టాయి. ఎన్నికలు జరిగే 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో వైన్‌షాపులు, బార్లు, క్లబ్‌లను మూసివేయనున్నారు. ఎక్సైజ్ శాఖ ఆదేశాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకు డ్రై డేస్ అమల్లో ఉంటాయి. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
నవంబర్ 1న జరగనున్న పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇందులో జిల్లా పోలీసులతో పాటు ఏపీఎస్పీ బలగాలు, ఇతర విభాగాల సిబ్బంది ఉన్నారు. మొత్తం 4,372 పోలింగ్ స్టేషన్ ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. వీటిలో 671 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల కోసం 3,355 మంది, 1,233 సున్నితమైన కేంద్రాల కోసం 4,943 మంది పోలీసులను ప్రత్యేకంగా కేటాయించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లు ఎలాంటి భయాలు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!