

ఆర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.4,563 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమ ప్రాంతాలు తుఫాన్ ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి. విద్యుత్ స్తంభాలు, సరఫరా లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా కోనసీమలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న స్తంభాలను మార్చడం, తెగిపోయిన విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయడం వంటి చర్యలను అధికారులు వేగవంతం చేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు కూడా రాష్ట్రానికి రానున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. తుఫాన్ కారణంగా విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని, పునరుద్ధరణ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి అదనపు సిబ్బంది, అవసరమైన సామగ్రిని పంపించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఏపీకి సహకారం అందించేందుకు అంగీకరించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఏపీ సాయం కోరగా, సరిహద్దు జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతు పనుల్లో పాల్గొంటున్నారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!