

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇందులో జాన్వీ కపూర్ పాత్రను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించారనే విమర్శలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ, జాన్వీ మాత్రం ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. అయితే, తాజాగా కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ టాక్‌షోలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ అంశంపై మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.
‘పెద్ది’లో తన పాత్రను మితిమీరిన లైంగిక కోణంలో చూపించడం తనను ఎంతగానో కలచివేసిందని, ముఖ్యంగా మహిళలపై అలాంటి చిత్రణ చూపే ప్రభావం గురించి ఆలోచించానని జాన్వీ చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో తనకూ కొంత బాధ్యత ఉందని అంగీకరిస్తూ, చిత్రీకరణ సమయంలోనే మరింత గట్టిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందని లేదా కొన్ని సన్నివేశాలకు నో చెప్పాల్సిందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో తనకున్న గుర్తింపు, అనుభవాన్ని ఉపయోగించి ముందుగానే స్క్రిప్ట్, తన పాత్ర చిత్రణపై స్పష్టత తీసుకోవాల్సిందని అభిప్రాయపడినట్లు సమాచారం. జాన్వీ వ్యాఖ్యలతో ‘పెద్ది’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని కొన్ని నెలల తర్వాత మళ్లీ చర్చించడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తుండగా, ఇతర సినిమాల్లోని ఇలాంటి సన్నివేశాలపై ఇదే స్థాయిలో చర్చ ఎందుకు జరగడం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!