

భారతదేశంలో వ్యంగ్య రూపంలో ప్రారంభమైన “కాక్‌రోచ్ జనతా పార్టీ” ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన డిజిటల్ యువజన ఉద్యమంగా మారింది. నిరుద్యోగ యువత ఆందోళనలను ఉద్దేశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అని వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తల తర్వాత ఈ ట్రెండ్ వేగంగా వ్యాపించింది. తరువాత వివరణ వచ్చినప్పటికీ, అప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం పెద్ద చర్చగా మారింది.
అమెరికాలో ప్రజా సంబంధాల విద్య పూర్తి చేసి, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేసిన అభిజీత్ దీప్కే ఈ నెల 16న ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే ఈ ఉద్యమానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కోట్లాది అనుచరులను సంపాదించుకుంది. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, వైద్యం, ఉపాధి అవకాశాలు, ప్రజా సేవలు, పాలనలో జవాబుదారీతనం వంటి అంశాలపై వ్యంగ్య రూపంలో ఈ ఉద్యమం ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్‌కు కూడా విస్తరించింది. అక్కడ “కాక్‌రోచ్ అవామీ పార్టీ”, “కాక్‌రోచ్ అవామీ లీగ్” పేర్లతో కొత్త సామాజిక మాధ్యమ గ్రూపులు ఏర్పడ్డాయి. భారతదేశం నుంచే ఈ ఆలోచనకు స్ఫూర్తి పొందామని వీరు బహిరంగంగానే చెబుతున్నారు. బొద్దింకను ప్రతికూల పరిస్థితుల్లో కూడా బతికే ప్రతీకగా చూపిస్తూ, ఇరుదేశాల యువత నిరుద్యోగం, పాలనా లోపాలపై డిజిటల్ వేదికల ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!