

2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రదాడి అమెరికాతో పాటు ప్రపంచ చరిత్రనే మార్చేసింది. అల్‌ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు అమెరికా తూర్పు తీర ప్రాంతం నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరిన నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేశారు. ఉదయం 8.46 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. 9.02 గంటలకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్‌ను ఢీకొంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్‌ను ఢీకొనగా.. యునైటెడ్ ఫ్లైట్ 93లో ప్రయాణికులు, సిబ్బంది తిరగబడటంతో అది పెన్సిల్వేనియాలోని ఓ పొలంలో కూలిపోయింది. దక్షిణ టవర్ 9.59 గంటలకు, ఉత్తర టవర్ 10.28 గంటలకు కుప్పకూలాయి. ఈ దాడుల్లో హైజాకర్లను మినహాయించి 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు.
ట్విన్ టవర్స్ కూలిన అనంతరం న్యూయార్క్‌లో భారీ సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు శిథిలాల్లో సహాయక చర్యలు కొనసాగించారు. గ్రౌండ్ జీరో వద్ద వ్యాపించిన దుమ్ము, విషపూరిత పదార్థాలకు గురైన అనేక మంది రక్షణ సిబ్బంది, బాధితులు తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ దాడులు అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపాయి. కాంటర్ ఫిట్జ్‌జెరాల్డ్ సంస్థలోనే 650 మందికిపైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. 9/11 ప్రభావం రెండు దశాబ్దాలు దాటినా కొనసాగుతూనే ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!