

భారత విమానయాన రంగం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) అపార అవకాశాలను అందిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఏరోస్పేస్ మార్కెట్‌లో మరింత మంది భారతీయ సరఫరాదారులను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్ కేవలం ఏరోస్పేస్ విడిభాగాల అసెంబ్లింగ్ కేంద్రంగా కాకుండా.. వాటి రూపకల్పన, ధ్రువీకరణ, తయారీకి కూడా ప్రధాన కేంద్రంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో విమానాల తయారీకి సంబంధించిన వివిధ నమూనాలను పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపారు. బోయింగ్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు సలీల్ గుప్తే మాట్లాడుతూ.. తమ సంస్థ ఏటా భారత్ నుంచి దాదాపు రూ.14,000 కోట్ల విలువైన ఉత్పత్తులు, సేవలను పొందుతోందని వెల్లడించారు. భారత్‌లో బోయింగ్‌కు దాదాపు 300 మంది సరఫరాదారులు ఉండగా.. వారిలో సుమారు 25 శాతం ఎంఎస్‌ఎంఈలే కావడం గమనార్హం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!