

విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీ పట్టి పరీక్షల్లో రాయడం కాకుండా.. వాటిని అర్థం చేసుకుని, విశ్లేషించి, కొత్త పరిస్థితుల్లో అన్వయించేలా ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల విధానంలో మార్పులు తీసుకురానున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యం, విశ్లేషణాత్మక దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పరీక్షించేలా రూపొందించనున్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులను చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లోని ప్రతి పాఠం చివర ఇచ్చిన ప్రశ్నల నుంచే పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నందున.. విద్యార్థులు సమాధానాలను గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉందని అధికారులు గుర్తించారు. దీనిని మార్చేందుకు ప్రత్యేక క్వశ్చన్ బ్యాంక్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియట్ విద్యా మండలి అధ్యాపకులకు కార్యశాలలు నిర్వహిస్తూ, సృజనాత్మకత మరియు విశ్లేషణాత్మక ఆలోచనను పరీక్షించే ప్రశ్నలను సేకరిస్తోంది. పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన ప్రశ్నలను కొత్త పాఠ్యపుస్తకాల్లో పాఠాల చివర చేర్చనున్నారు. దీంతో పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలోనే విద్యార్థులు కొత్త తరహా ప్రశ్నలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!