

బాలుర ఉన్నత పాఠశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులు ఫుడ్ కమిషన్ సభ్యుడు కృష్ణకిరణ్ ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి వచ్చాయి. గురువారం పాఠశాలను తనిఖీ చేసిన ఆయనకు విద్యార్థులు అన్నంలో పురుగులు వస్తున్నాయని, పాచిపట్టిన నీళ్లు తాగాల్సి వస్తోందని, సరిగ్గా ఉడకని భోజనం అందిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వంటశాలను పరిశీలించిన కృష్ణకిరణ్ భోజనం నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట సిబ్బందిని వెంటనే మార్చాలని డీఈవోకు సూచించారు. తాగునీటి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో నీటి ట్యాంకును పరిశీలించారు. గత నెలకు సంబంధించిన గుడ్లను ఇప్పటికీ విద్యార్థులకు ఇస్తున్నారన్న ఫిర్యాదుపై ఆగ్రహం వ్యక్తం చేసి, సరఫరాలో అవకతవకలు ఉంటే సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రాంగణంలో సిగరెట్ తాగుతున్నారన్న విద్యార్థుల ఫిర్యాదుపైనా కృష్ణకిరణ్ తీవ్రంగా స్పందించారు. పాఠశాలపై పర్యవేక్షణ లోపించడంపై ఎంఈవోను ప్రశ్నించి, ఇద్దరు ఎంఈవోలకు నోటీసులు ఇవ్వాలని డీఈవోకు సూచించారు. ఫిర్యాదు చేసినందుకు విద్యార్థులను ఎవరైనా బెదిరిస్తే నేరుగా తనను సంప్రదించాలని వారికి భరోసా ఇచ్చారు. మూడు రోజుల్లో పరిస్థితుల్లో మార్పు కనిపించకపోతే సంబంధిత అధికారులను విజయవాడకు పిలిపిస్తామని హెచ్చరించారు. తనిఖీలో ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!