

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన వ్యాపార విస్తరణలో మరో కీలక అడుగు వేసింది. కృత్రిమ మేధ ఆధారిత డేటా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించిన సంస్థ, వచ్చే ఏడేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఈ ప్రణాళికతో దేశంలోనే అతిపెద్ద సామర్థ్యం కలిగిన డేటా కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది.
రిలయన్స్ ఇప్పటికే శుద్ధి పరిశ్రమ, పెట్రో రసాయనాల రంగాల నుంచి ఇంధనం, డిజిటల్ సేవలు, చిల్లర వ్యాపారం, మాధ్యమాలు, హరిత ఇంధన సాంకేతికత వంటి విభాగాల్లో తన ఉనికిని విస్తరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన కృత్రిమ మేధ ప్రభావ సదస్సులో ముఖేష్ అంబానీ ఈ పెట్టుబడుల దిశగా సంకేతాలు ఇచ్చారు. దేశ దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధి, వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ డేటా కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రిలయన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలతో పాటు లిగ్నైట్ ఆధారిత భూగర్భ వాయువీకరణ ప్రాజెక్టులపై కూడా సంస్థ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గుజరాత్‌లో ప్రాజెక్టుల అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!