

తెలంగాణతో ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ కొనసాగిస్తున్న అనుబంధాన్ని భవిష్యత్‌లో మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. లోక్‌భవన్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ తో గవర్నర్ భేటీ అయ్యారు. విద్య, ఆరోగ్యం, పట్టణ అభివృద్ధి, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో ఏకేడీఎన్ చేస్తున్న కార్యక్రమాలను గవర్నర్ ప్రస్తావించారు. హైదరాబాద్ సమీపంలోని ఆగాఖాన్ అకాడమీ భవిష్యత్ తరాల నాయకులను తీర్చిదిద్దుతున్న విద్యాసంస్థగా నిలుస్తోందని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, పరిసరాల అభివృద్ధిలో ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి ఉదాహరణగా నిలుస్తున్నాయని అన్నారు.
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మానవాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంతో ఏకేడీఎన్ అభివృద్ధి భాగస్వామ్యాన్ని కొనసాగించి మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ కళా వైభవాన్ని ప్రతిబింబించే చేర్యాల నకాషీ చిత్రాన్ని, హంస ఆకృతితో రూపొందించిన కరీంనగర్ వెండి ఫిలిగ్రీ వీణను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్‌కు బహూకరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!