

హైదరాబాద్ లోతుకుంటలోని 40 ఎకరాల భూ వివాదానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేయడంలో 219 రోజుల జాప్యం జరిగిందని ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా అప్పీల్ దాఖలు చేయడానికి 90 రోజుల గడువు ఉండగా, ఇంతటి ఆలస్యాన్ని అంగీకరించలేమని స్పష్టం చేసింది.
లోతుకుంటలోని 40 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. అయితే కాలపరిమితి నిబంధనల కారణంగా ఆ కేసు విచారణకు అర్హత లేదని కోర్టు పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా, 2025 అక్టోబర్ 7న ధర్మాసనం కింది కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేసు ప్రధాన అంశాలను పరిశీలించకుండానే, పిటిషన్ దాఖలులో జరిగిన జాప్యాన్ని కారణంగా చూపుతూ కొట్టివేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!