

నల్గొండ జిల్లా అప్పాజీపేటలో సుమారు 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్ (కుండల తయారీలో ఉపయోగించే మట్టి పరికరం) తాజాగా వెలుగుచూసింది. శాతవాహనుల పూర్వకాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ పురావస్తువును తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు చిక్కుల యాదగిరి, మేక అశోక్‌రెడ్డి గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తించారు. ఈ విషయాన్ని తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ మంగళవారం వెల్లడించారు.
ప్రాచీన కాలంలో కుండలు తయారు చేసేటప్పుడు టెర్రకోట డాబర్‌ను కుండ లోపలి వైపు ఉంచి, పై నుంచి మరో చెక్క బద్దతో కొడుతూ కుండకు కావాల్సిన ఆకారాన్ని ఇచ్చేవారని హరగోపాల్ తెలిపారు. ఇలాంటి టెర్రకోట డాబర్లు గతంలో ఉత్తరప్రదేశ్‌లోని ఖేరా ప్రాంతంలో లభించాయని, వాటి కాలాన్ని క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 600 మధ్యగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అప్పాజీపేటలో ఈ పురావస్తువు లభించిన ప్రాంతంలో శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు చేపడితే మరిన్ని చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చరిత్ర బృందం తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!