

అధిక సామర్థ్యం కలిగిన అణు విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ సహా 9 రాష్ట్రాల్లోని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు నవీన్ జిందాల్ గ్రూప్ వెల్లడించింది. అణు విద్యుత్తు రంగంలో అవసరమైన సాంకేతికత కోసం వివిధ సంస్థలతో భాగస్వామ్యాలపై చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. 2047 నాటికి దేశంలో 100 గిగావాట్ల అణు విద్యుత్తు సామర్థ్యం సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తమ గ్రూప్ 18 గిగావాట్ల సామర్థ్యం సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టుల కోసం రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అవసరమవుతాయని సంస్థ పేర్కొంది. ఉక్కు, గనులు, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న జిందాల్ గ్రూప్, అణు విద్యుత్తు రంగంలోకి ప్రవేశించేందుకు జిందాల్ న్యూక్లియర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల ఎంపికపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సంస్థ తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!