

2026 లో భారతీయ కార్పొరేట్ సంస్థలు గత ఏడాది (2025) తో పోలిస్తే మరింత భారీగా నియామకాలు చేపట్టనున్నాయి. స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ టీమ్‌లీజ్ అంచనా ప్రకారం, 2026 లో భారతీయ కంపెనీలు 1 కోటి నుంచి 1.2 కోట్ల వరకు అదనపు ఉద్యోగాలు సృష్టించనున్నాయి. గత ఏడాది ఈ సంఖ్య 80 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంది.
ఈవై (ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా), గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డియాజియో, టాటా మోటార్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలు క్యాంపస్ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఉద్యోగుల్లో మహిళల శాతాన్ని పెంచడం, వైవిధ్యాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను కలిగి ఉన్నాయి.
అకౌంటింగ్, ఆడిటింగ్ సేవలు అందించే ఈవై ఇండియా, జూన్ 2026 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 14 వేల నుంచి 15 వేల మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఏటా ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్ కాలేజీల నుంచి సుమారు 2 వేల మందిని తీసుకుంటున్నట్లు సంస్థ సీహెచ్ఆర్ఓ ఆర్తీ దువా తెలిపారు. డియాజియో ఇండియాలో డిజిటల్, సప్లై చైన్ విభాగాల్లో నియామకాలు జరగనున్నట్లు సంస్థ ప్రకటించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!