
.jpg&w=3840&q=75)
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మరో కీలక మైలురాయిని అందుకుంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. ఇది తొలి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం కంటే, అలాగే గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోని 7.4 శాతంతో పోలిస్తే మరింత అధికం. ఆర్థిక వ్యవస్థ పరిమాణం సుమారు 4.18 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.376 లక్షల కోట్లు) చేరడంతో జపాన్ ను భారత్ వెనక్కి నెట్టగలిగింది.
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే 2.5 నుంచి 3 ఏళ్లలో జర్మనీ ని కూడా అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. 2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం సుమారు 7.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఈ విశ్వాసానికి బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక పరిమాణంలో అమెరికా, చైనా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా ప్రైవేటు వినియోగం పెరగడం ఆర్థిక వృద్ధికి ప్రధానంగా తోడ్పడిందని కేంద్రం పేర్కొంది. ఇదే విషయాన్ని పలు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా ధృవీకరించాయని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోందని, ఈ వృద్ధి ధోరణిని నిలబెట్టుకునే సామర్థ్యం దేశానికి ఉందని స్పష్టం చేసింది.
స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్‌ను ‘అధిక మధ్య ఆదాయ దేశం’గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తక్కువ ద్రవ్యోల్బణం, తగ్గుతున్న నిరుద్యోగం, బలపడుతున్న ఎగుమతులు, వాణిజ్య రంగంలో రుణాల వృద్ధి, పట్టణ వినియోగం పెరుగుతుండడం వంటి అంశాలు దేశ ఆర్థిక పునాదులను మరింత బలపరుస్తున్నాయని కేంద్రం వివరించింది.












.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!