

ఆదాయపు పన్ను శాఖ 2026-27 సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్-2 ఫారాన్ని ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ ఫైలింగ్‌తో పాటు ఎక్సెల్ యుటిలిటీ కూడా సిద్ధంగా ఉన్నట్లు బుధవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. చిన్న, మధ్యస్థాయి ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాలను మే 15న ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇళ్లు లేదా స్థలాల విక్రయం ద్వారా మూలధన లాభాలు లేదా నష్టాలు పొందిన వారు, విదేశీ ఆదాయం ఉన్న వారు ఐటీఆర్-2 ద్వారా రిటర్నులు దాఖలు చేయాలి. వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు ఉండి జీతం లేదా పింఛన్ ద్వారా ఆదాయం పొందే వారు ఐటీఆర్-1ను ఎంచుకోవాలి. ఈ ఏడాది కొత్త మార్పుల ప్రకారం రెండు ఇళ్ల వరకు ఆస్తి ఉన్నవారికి కూడా ఐటీఆర్-1 వినియోగానికి అనుమతి ఇచ్చారు. సెక్షన్ 112ఏ కింద రూ.1.25 లక్షల లోపు దీర్ఘకాలిక మూలధన లాభాలు ఉన్నవారూ ఈ ఫారాన్ని ఉపయోగించవచ్చు. వ్యాపారులు, వృత్తి నిపుణులు, అలాగే షేర్ మార్కెట్‌లో ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్ లావాదేవీలు చేసే వారు ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 (సుగమ్) ఉపయోగించాలి. వేతన జీవులు ఫారం-16 అందుకున్న తర్వాతే రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. జులై 31లోపు రిటర్నుల ప్రక్రియను పూర్తి చేయాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!