

సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో వివిధ అంశాలపై మాట్లాడేటప్పుడు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. భాష, భావ వ్యక్తీకరణ విషయంలో హద్దులు దాటవద్దని, వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా స్పందించాలని, ఆవేశానికి లోనుకాకుండా అసభ్య పదజాలం ఉపయోగించవద్దని సూచించారు. మహిళలను గౌరవిస్తూ మాట్లాడాలని, పార్టీ అంతర్గత అంశాలను సోషల్ మీడియాలో ఇష్టానుసారం చర్చించరాదని ఆదేశించారు.
పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా, జనసైనికులను రెచ్చగొట్టేలా చేసే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలని, రాజకీయ ప్రత్యర్థుల సోషల్ మీడియా ప్రచార వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, జనసేన కోసం కష్టపడి పనిచేసే జనసైనికులు, వీర మహిళల సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!