

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రాష్ట్రంలోని 3.42 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడంతో 62 లక్షల మంది అదనంగా లబ్ధి పొందారని ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో “ఇన్వెస్ట్ తెలంగాణ” థీమ్‌తో నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయించింది. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికను ఆవిష్కరించడంతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టనుంది. ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించడం, 17.54 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,389 బేసిక్ ప్రైస్‌తో ఈ-వేలం ద్వారా విక్రయించడం, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఏడు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్ల పథకంతో పాటు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీకి ఆమోదం తెలిపింది. HILT పాలసీ దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-2కు రూ.2,100 కోట్ల అంచనా వ్యయాన్ని, గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనలను కూడా ఆమోదించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!