

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో పాటు ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి తదితరులు తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డిని కలిసి టెస్సెరాక్ట్ ఏరోస్పేస్‌కు భూముల కేటాయింపుపై ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.7 కోట్లకే కేటాయించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కేవలం రూ.1 లక్ష పెయిడ్-అప్ క్యాపిటల్, ఉద్యోగులు లేని సంస్థకు ఇంత విలువైన భూమిని ఎలా కేటాయించారని ప్రశ్నించారు.
టెస్సెరాక్ట్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా, మేనల్లుడు నయన్ రెడ్డి సీఈవోగా ఉన్నారని, భూ కేటాయింపులకు ఐదు నెలల ముందే నయన్ రెడ్డి సీఈవోగా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. కంపెనీ వెబ్‌సైట్, ఫొటోలు, బినామీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఆరోపణలు చేశారు. టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను నిలిపివేసి రద్దు చేయాలని, సీఎం పాత్రపై విచారణ జరిపి నివేదికను గవర్నర్‌కు పంపాలని లోకాయుక్తను కోరారు. మంత్రి శ్రీధర్ బాబు, టీజీఐఐసీ అధికారులపై కూడా చట్టప్రకారం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!