

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 70 డాలర్లలోపు ఉన్న ధర ప్రస్తుతం 100 డాలర్లను దాటింది. దేశ అవసరాల్లో సుమారు 89 శాతం చమురు, 51 శాతం సహజవాయువు దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. డాలర్ బలపడటం, రూపాయి బలహీనపడటం వల్ల వస్తువుల ధరలు పెరగడం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశీయ ఉత్పత్తి తగ్గడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. వరుసగా పదకొండో ఏడాది కూడా చమురు ఉత్పత్తి తగ్గగా, సహజవాయువు ఉత్పత్తి కూడా రెండో సంవత్సరం తగ్గింది. పాత చమురు క్షేత్రాల్లో నిల్వలు తగ్గిపోవడం, కొత్త క్షేత్రాల అన్వేషణలో లోపాలు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం చమురు ఉత్పత్తి 2.5 శాతం తగ్గి 28 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరగా, గ్యాస్ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా కొన్ని కీలక క్షేత్రాల నుంచి ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రాకపోవడం ప్రభావం చూపింది.
చమురు అన్వేషణకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. నిబంధనల సరళీకరణ, పర్యావరణ అనుమతుల సులభతరం, డేటా సదుపాయాల ఏర్పాట్లు చేసినా విదేశీ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు దిగుమతులు కొనసాగిస్తూ, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!