

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో ఆచూకీ లేని (అన్‌ట్రేసబుల్/ఆబ్సెంట్) ఓటర్లు ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,77,885 మంది ఇలాంటి ఓటర్లు గుర్తించగా, వారిలో 1,11,027 మంది (14.27%) కడప, కర్నూలు, తిరుపతి, చంద్రగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనే ఉన్నారు. రాష్ట్ర సగటు 1.87 శాతం మాత్రమే ఉండగా, కడపలో 11.16%, కర్నూలులో 7.72%, తిరుపతిలో 6.95%, నెల్లూరు రూరల్‌లో 6.48%, చంద్రగిరిలో 6.15 శాతం నమోదవడం అసాధారణంగా కనిపిస్తోంది.
ఇదే సర్వేలో పాణ్యం నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్ ఎంట్రీ ఓటర్లు గుర్తించగా, కర్నూలు, అనంతపురం అర్బన్, పెనమలూరు, నెల్లూరు సిటీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తిరుపతిలో 2,95,288 మంది ఓటర్లలో 57,256 మంది (19.39%) శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు. రంపచోడవరం నియోజకవర్గంలో అత్యధికంగా మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నట్లు తేలగా, అరకు, ఇచ్చాపురం, పాడేరు, కోవూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొలగించాల్సిన ఓట్ల జాబితాలో 44,89,488 ఓట్లు ఉండగా, తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు రూరల్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లోనే గణనీయమైన సంఖ్య నమోదైంది. అలాగే 2002 ఓటర్ల జాబితాతో వివరాలను అనుసంధానం చేయని "నో మ్యాపింగ్" కేసులు అత్యధికంగా చంద్రగిరిలో గుర్తించబడటం ఎన్నికల జాబితాల ఖచ్చితత్వంపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!