

ఉద్యోగాల పై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేశ్ వారియర్ తెలిపారు. ఈ కొత్త సాంకేతికత వల్ల కొన్ని అవాంతరాలు వచ్చినా, అదే స్థాయిలో కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని చెప్పారు.
హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) వార్షిక సదస్సులో గురువారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1990 లలో కార్యాలయాల్లో కంప్యూటర్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇలానే ఉద్యోగాల పై భయాలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా ఆ టెక్నాలజీ మరిన్ని అవకాశాలను తీసుకువచ్చిందని చెప్పారు.
భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్యతరహా సంస్థలే ఏఐ సాధనాలను వేగంగా స్వీకరిస్తున్నాయని అన్నారు. అయితే ఏజెంటిక్ ఏఐ టూల్స్ ఉపయోగించేటప్పుడు ఆయా వ్యాపార రంగాల పై పూర్తి అవగాహన ఉండటం చాలా ముఖ్యమని సూచించారు. కాలేజీల్లో బోధించే ఏఐ పాఠ్యాంశాలు మరియు పరిశ్రమ అవసరాల మధ్య ప్రస్తుతం పెద్ద వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. ఈ అంతరాన్ని త్వరగా తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. కొత్త వ్యాపార సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలు భారత్లో తమ జీసీసీలు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.
ఇక ఉద్యోగాల్లో కొనసాగాలంటే ఉద్యోగులు నిరంతరం మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవడం తప్పనిసరిగా మారిందని ఆయన స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!