

భారత్‌లో 6G టెక్నాలజీ అభివృద్ధికి దేశీయ టెలికాం సంస్థలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో టెలికాం పరికరాల తయారీ సంస్థ లేఖా వైర్‌లెస్ సొల్యూషన్స్ కీలక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2029 నాటికి 6G ట్రయల్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయాలని, 2032 నాటికి అధునాతన 6G టెలికాం పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రాము శ్రీనివాసయ్య పీటీఐకి వెల్లడించారు. 5Gతో పోలిస్తే 6Gలో మరింత వేగవంతమైన డేటా ప్రసారం, తక్కువ లేటెన్సీ, మెరుగైన నెట్‌వర్క్ సామర్థ్యం ఉండేలా పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కంపెనీ ప్రణాళిక ప్రకారం 2029 నాటికి కనీస ఆచరణీయ ఉత్పత్తి (MVP)ను అభివృద్ధి చేసి, సాంకేతిక సంసిద్ధత స్థాయి (TRL) 4కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం 2032 నాటికి వాస్తవ పరిస్థితుల్లో పరీక్షలు పూర్తిచేసి TRL 9 స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. అంతర్జాతీయ 3GPP ప్రమాణాల రూపకల్పనలో భాగంగా ఇప్పటివరకు 112 సాంకేతిక ప్రతిపాదనలు అందించినట్లు సీఈఓ తెలిపారు. భారత నావికాదళం, సైన్యం అవసరాల కోసం 4G నెట్‌వర్క్ పరిష్కారాలను అమలు చేయడంతో పాటు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమెరికా, జపాన్‌లలో ప్రైవేట్ 5G నెట్‌వర్క్‌లను కూడా అమలు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.87 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన సంస్థ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లకు పైగా ఆదాయం సాధించవచ్చని అంచనా వేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!