

బర్త్‌డే శుభాకాంక్షలు, ముఖ్యమైన రిమైండర్లు, కార్యాలయ సమాచారాన్ని ముందుగానే పంపించేలా వాట్సాప్ కొత్త షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు కావాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకుని మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లలోనూ ఈ సదుపాయం పనిచేస్తుంది. కనీసం 10 నిమిషాల తర్వాత నుంచి గరిష్ఠంగా రెండు వారాల వరకు మెసేజ్‌లను ముందుగానే షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిర్ణయించిన సమయంలో ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా, వాట్సాప్ యాప్ మూసి ఉన్నా మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డెలివరీ అవుతాయని తెలుస్తోంది. టెక్స్ట్, లింకులు, ఫొటోలు, వీడియోలను షెడ్యూల్ చేయవచ్చు. వీటికి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుంది. అయితే ప్రస్తుతం PDF వంటి డాక్యుమెంట్లను షెడ్యూల్ చేసే సదుపాయం లేదని సమాచారం.
షెడ్యూల్ చేసిన మెసేజ్‌లు డెలివరీ అయ్యే వరకు చాట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లోని ప్రత్యేక విభాగంలో కనిపిస్తాయి. అవసరమైతే వాటిని ముందుగానే తొలగించుకోవచ్చు. గ్రూప్ చాట్‌లో షెడ్యూల్ చేసిన మెసేజ్, అది డెలివరీ అయ్యే సమయానికి గ్రూప్‌లో ఉన్న సభ్యులకు మాత్రమే చేరుతుంది. ఆ తర్వాత గ్రూప్‌లో చేరిన కొత్త సభ్యులకు ఆ మెసేజ్ కనిపించదు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి ముందుగా వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేసి మెసేజ్ లేదా ఫొటో, వీడియో, లింక్‌ను జత చేయాలి. అనంతరం సెండ్ బటన్‌ను కొద్దిసేపు నొక్కి ఉంచితే తేదీ, సమయాన్ని ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది. వివరాలను ఎంచుకుని షెడ్యూల్ చేసిన తర్వాత చాట్‌లో ప్రత్యేక విభాగం ద్వారా వాటిని పరిశీలించవచ్చు. ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!