

మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ బిల్లును ఆమోదించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని పార్టీలను కలుపుకొని బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్నారని పేర్కొంటూ, తెలుగు ప్రజలు, మహిళల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినా, లోక్‌సభలో ఆగిపోయిందని గుర్తుచేశారు. ఈసారి ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
850 పార్లమెంట్ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో తప్పేముందని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ అంశంగా చూడకూడదని, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. గతంలోనూ ఈ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని, ఈసారి కూడా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. డీలిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!