

వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కీలక హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్‌లో ఐదు భద్రతా లోపాలను గుర్తించినట్లు నవంబర్ 26న విడుదల చేసిన అడ్వైజరీలో పేర్కొంది. ఈ లోపాలను హ్యాకర్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుని వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై వాట్సాప్ వాడుతున్న వారికి ఈ ముప్పు పొంచి ఉందని తెలిపింది. హానికరమైన మెసేజ్‌లు, లింకులు, ఫైల్స్ ద్వారా ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి చొరబడే ప్రమాదం ఉందని వివరించింది.
ఈ భద్రతా లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుంటే ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, చాట్ వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. కొన్ని హానికరమైన లింకుల ద్వారా ఐపీ అడ్రస్‌లు కూడా బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని, ఆ సమాచారాన్ని స్పామ్ సందేశాలు పంపడం లేదా బ్లాక్‌మెయిలింగ్ వంటి చర్యలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అందువల్ల తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులపై క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ తెరవకూడదని సూచించింది. వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని, కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్ వాడిన తర్వాత లాగ్‌అవుట్ కావాలని తెలిపింది. అనుమానాస్పద మెసేజ్‌లకు స్పందించకుండా వాటిని తొలగించాలని, వ్యక్తిగత సమాచార భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని CERT-In సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!