

అమెజాన్ తన అలెక్సా ఆధారిత స్మార్ట్ హోమ్ పరికరాల విభాగాన్ని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా అలెక్సా ఫోటో ఫ్రేమ్, ఎకో టైమ్ పేరుతో రెండు కొత్త ఉత్పత్తులను అక్టోబర్ 28న పరిచయం చేసింది. పండుగల సీజన్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు పెరిగే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ గ్యాడ్జెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 10 అంగుళాల అలెక్సా ఫోటో ఫ్రేమ్‌లో యాంటీ-గ్లేర్ డిస్ప్లే ఉండగా, అలెక్సా+ సాయంతో ఫొటోలను ఎంపిక చేసి ప్రదర్శించే సదుపాయం కల్పించారు. ఫొటోలకు వాయిస్ నోట్స్ జోడించడంతో పాటు, కొత్తగా తీసిన చిత్రాలను ఆటోమేటిక్‌గా సింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరికరం అమెరికా మార్కెట్లో 199.99 డాలర్ల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
మరోవైపు, ఎకో టైమ్ స్మార్ట్ అలారం క్లాక్‌లో నిద్ర దశలను గుర్తించే ఆప్షనల్ సెన్సింగ్ ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారులు ఎంచుకున్న అలారం సమయానికి 10 నుంచి 60 నిమిషాల వ్యవధిలో నిద్ర లేపే స్మార్ట్ అలారం, సూర్యోదయాన్ని పోలిన లైటింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి. దీని ధర 199.99 డాలర్లు కాగా, కిడ్స్ వెర్షన్ ధర 209.99 డాలర్లుగా నిర్ణయించారు. వీటితో పాటు ఎకో డాట్, ఎకో స్టూడియో, ఎకో షో 16 పరికరాలను కూడా అమెజాన్ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త ఎకో డాట్లో స్మార్ట్ హోమ్ హబ్, ఈరో వై-ఫై ఎక్స్టెండర్ ఉండగా, ఎకో స్టూడియో విత్ హోమ్ కెమెరాలో ఇంటి భద్రతను పర్యవేక్షించే ఫీచర్లు అందించారు. అప్డేట్ చేసిన ఎకో షో 16లో పెద్ద డిస్ప్లే, ఫైర్ టీవీ, స్మార్ట్ హోమ్ టూల్స్ ఉన్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!