

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో భాగంగా నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ జెయింట్స్ (GG)పై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అభిమానులకు పండుగ వాతావరణాన్ని కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. గుజరాత్ బౌలర్ కష్వీ గౌతమ్ దూకుడైన బౌలింగ్‌తో విజృంభించడంతో 45 పరుగులకే ఆర్సీబీ నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ సమయంలో రాధా యాదవ్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. 47 బంతుల్లో 66 పరుగులు చేసిన ఆమె అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌కు నిలువెత్తు బలం ఇచ్చింది. రీచా ఘోష్ (44 పరుగులు, 28 బంతుల్లో) రాధాకు చక్కని మద్దతివ్వడంతో ఐదో వికెట్‌కు కీలకంగా 105 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. చివరి ఓవర్లలో నడైన్ డీ క్లర్క్ (26 పరుగులు, 12 బంతుల్లో) సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 182/7 పరుగుల భారీ స్కోరు సాధించింది.

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ఆరంభం నుంచే తడబడింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్లు, లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ గుజరాత్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చివేసింది. ఆమె ఐదు వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పగా, లారెన్ బెల్ మూడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించింది. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ 18.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో ఆర్సీబీ అజేయంగా దూసుకుపోతుండగా, గుజరాత్ జెయింట్స్ ఈ సీజన్లో రెండో ఓటమిని చవిచూసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!