

ఐపీఎల్ తదుపరి సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినట్లు ప్రచారం జరుగుతున్న ట్రేడ్ డీల్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ ఒప్పందంలో భాగంగా హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు, అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు మారినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ముంబై జట్టు తదుపరి కెప్టెన్ ఎవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది. హార్దిక్ గత మూడు సీజన్లుగా జట్టుకు నాయకత్వం వహించగా, ఇప్పుడు అతడు జట్టును వీడనున్న నేపథ్యంలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే ముంబైకి ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు చేపడతాడా? అనే చర్చ కూడా జోరందుకుంది.
ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో చర్చనీయాంశమైంది. హామిల్టన్‌లో వర్షం కారణంగా మూడో వన్డే రద్దైన అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను రోహిత్ పలకరించగా, అతడు రోహిత్‌ను 'హలో కెప్టెన్' అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యతో రోహిత్ మళ్లీ ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే శాంట్నర్ వ్యాఖ్య ఒక్కటే కెప్టెన్సీ మార్పునకు సంకేతమని చెప్పలేం. మరోవైపు, హార్దిక్ పాండ్యా రూ.18 కోట్ల ఒప్పందంతో పంజాబ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. గతంలో ముంబై తరఫున రూ.16.35 కోట్లు అందుకున్న హార్దిక్, తన ఐపీఎల్ కెరీర్‌లో 162 మ్యాచ్‌లు ఆడి 2,955 పరుగులు, 82 వికెట్లు సాధించాడు. పంజాబ్ తరఫున 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ ఇప్పుడు ముంబై జట్టులో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ట్రేడ్‌పై, కెప్టెన్సీ మార్పుపై ముంబై ఇండియన్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!