

భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం కీలకమైన నాలుగో మ్యాచ్ జరగనుంది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమ్‌ఇండియా 2-0తో ఆధిక్యంలో ఉండగా.. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సిరీస్‌ను కాపాడుకోవాలంటే న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇరు జట్లు పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చాయి. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అన్షుల్ కంబోజ్ వన్డే జట్టును వీడటంతో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లకు తుది జట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇషాన్ కిషన్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో 0, 23 పరుగులకే పరిమితమైన రోహిత్ ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్న శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది.
మరోవైపు న్యూజిలాండ్ కూడా జట్టులో భారీ మార్పులు చేసింది. టెస్టు సిరీస్ కోసం టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, హెన్రీ నికోల్స్‌లను వన్డే జట్టు నుంచి తప్పించింది. వారి స్థానాల్లో ఫిన్ అలెన్, మిచ్ హే, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, నిక్ కెల్లీ, బ్రెట్ రాండెల్‌లకు చోటు కల్పించింది. రెండో వన్డేలో గాయపడిన బ్లెయిర్ టిక్నర్ ఈ మ్యాచ్‌కూ దూరమయ్యాడు. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఈ మ్యాచ్‌లోనైనా ఫామ్ అందుకోవాలని కివీస్ భావిస్తోంది. మౌంట్ మౌంగనుయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశముంది. ఈ వేదికపై భారత్ ఆడిన మూడు వన్డేల్లో రెండింటిలో విజయం సాధించింది. ఇక్కడ జరిగిన గత నాలుగు డే-నైట్ వన్డేల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే గెలవడంతో టాస్ కీలకంగా మారనుంది. సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుండగా.. సొంతగడ్డపై పుంజుకుని పోటీలో నిలవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!