

మణిపుర్‌లోని లామ్‌లయ్ లెకయ్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాక్సర్ అంబేకర్ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. అతడి తండ్రి మదన్ రోజువారీ కూలీగా పనిచేస్తుండగా.. తల్లి బబిత మణిపురి సంప్రదాయ దుస్తులు కుడుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌పై ఆసక్తి పెంచుకున్న అంబేకర్.. అకాడమీలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నడపడమే కష్టమైనప్పటికీ.. ఖర్చులు తగ్గించుకుని గ్రామానికి సమీపంలోని నంగోడా అకాడమీలో చేర్పించారు. అయితే అతడికి అవసరమైన శిక్షణ సదుపాయాలు, పోషకాహారం అందించడం కుటుంబానికి పెద్ద సవాలుగా మారింది. అకాడమీకి వెళ్లేందుకు తండ్రి కేవలం రూ.200తో పాత సైకిల్ కొనిచ్చాడు. సొంతంగా నాణ్యమైన బాక్సింగ్ గ్లోవ్స్ కొనుక్కునే స్థోమత లేకపోవడంతో ఇతరుల దగ్గర అరువు తెచ్చుకుని శిక్షణ కొనసాగించాడు. అయినప్పటికీ ఏనాడూ ఫిర్యాదు చేయకుండా ఆటపైనే దృష్టి పెట్టాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన పట్టుదలతో అంబేకర్ క్రమంగా బాక్సింగ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022లో ఇంఫాల్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో ప్రతిభ చూపించి జాతీయ క్రీడా అకాడమీకి ఎంపికయ్యాడు. అక్కడ కోచ్ జితేన్ సింగ్ వద్ద శిక్షణ పొందుతూ వయసు విభాగాల పోటీల్లో నిలకడగా రాణించాడు. 2025 నుంచి అతడి విజయ పరంపర మరింత వేగం పుంజుకుంది. రోహ్‌తక్‌లో జరిగిన జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించడంతో పాటు ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం గెలుచుకున్నాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఫ్యూచర్స్ కప్‌లో రజత పతకాన్ని అందుకున్నాడు. ఈ సీజన్‌లోనూ అదే జోరు కొనసాగించిన అంబేకర్.. యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఒకప్పుడు కనీస వసతుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న అతడు.. నేడు అంతర్జాతీయ వేదికపై దేశానికి గర్వకారణంగా నిలిచాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!