

పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రూఫ్‌టాప్ సోలార్ పథకం అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఇంధన రంగ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేయాలని కోరగా, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో రికార్డు సమయంలో 7.86 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను 24 గంటల్లో పునరుద్ధరించిన విద్యుత్ శాఖ బృందాన్ని కూడా ప్రశంసించారు. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2014లో 2.8 గిగావాట్ల నుంచి ప్రస్తుతం 175 గిగావాట్లకు చేరిందని, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 66 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఇంధన సంస్థలతో రూ.43,871 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 17 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. మరో మూడు ప్రాజెక్టులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 4,700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్సాల్ సీజీఎస్ గ్రీన్ అమ్మోనియా, సన్‌షూర్ ఎనర్జీ, బీఎల్‌ఈ రెన్యూవబుల్స్, అకాయా ఎనర్జీ తదితర సంస్థలు ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నాయి. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 160 గిగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 114.25 గిగావాట్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్లడించారు. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు దేశ, విదేశాలకు చెందిన ఇంధన రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!