

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల సదస్సులో పెట్టుబడుల ఆకర్షణతో పాటు వివిధ రంగాలపై అర్థవంతమైన చర్చలు, నాలెడ్జ్ షేరింగ్ జరిగాయని వెల్లడించారు. గత రెండేళ్లలో ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామికాభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. గతంలో ఎంఓయూలు కాగితాలకే పరిమితమయ్యేవని, ప్రస్తుతం ఒప్పందాలను నిరంతరం పర్యవేక్షిస్తూ కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 25 సెక్టోరల్ పార్కులను ఏర్పాటు చేశామని, పరిశ్రమలకు అనుమతులు త్వరగా ఇచ్చేందుకు స్వీయ ధ్రువీకరణ, రియల్‌టైమ్ అనుమతుల విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేశామని, ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
అమరావతిని క్వాంటం కంప్యూటర్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నామని చంద్రబాబు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, త్వరలోనే ‘మేడ్ ఇన్ అమరావతి’ క్వాంటం కంప్యూటర్లను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణతో పాటు అనకాపల్లిలో స్టీల్ సిటీ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. విశాఖ నుంచి వివిధ దేశాలకు సబ్‌సీ కేబుళ్లు వేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలు దేశం, రాష్ట్రంపై చూపే ప్రభావాలు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై సదస్సులో చర్చించినట్లు వివరించారు. రాబోయే భాగస్వామ్య సదస్సుకు వచ్చే ప్రతినిధులను అరకు లోయకు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తామని సీఎం తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!