

భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభతో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అద్భుతమైన దూకుడు ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్, అండర్-19 ఆసియాకప్ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.
శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ బౌలర్ల పై విరుచుకుపడిన వైభవ్ 95 బంతుల్లోనే 171 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 14 సిక్స్‌లు ఉండటం విశేషం. కేవలం 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన వైభవ్, అండర్-19 స్థాయిలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు.
వైభవ్‌తో పాటు ఆరోన్ జార్జ్ (69), విహాన్ మల్హోత్రా (69) కీలకంగా రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసింది. ఇది అండర్-19 వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోరుగా నిలిచింది. అంతేకాదు, 2002 లో ఇంగ్లాండ్ పై అంబటి రాయుడు చేసిన 177 పరుగుల తర్వాత యూత్ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఒక దశలో కేవలం 53 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ ఉద్దిష్ సురి (78 నాటౌట్), పృథ్వీ మధు (50) ఏడో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. చివరికి యూఏఈ 50 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో దీపేశ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!