

టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియా వేదికలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో తన పేరు, ఫొటోలు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గావస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అధికారిక ఫిర్యాదుగా పరిగణించాలని, హక్కులు ఉల్లంఘిస్తున్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సంబంధిత సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ మాట్లాడుతూ, ఆన్లైన్లో అభ్యంతరకర కంటెంట్‌పై చర్యలు కోరే వారు ముందుగా ఐటీ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫిర్యాదు వ్యవస్థను వినియోగించుకోవాలని సూచించారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాతాలకు సంబంధించిన బేసిక్ సబ్‌స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ (BSI), ఐపీ అడ్రస్ వివరాలను అందజేస్తామని మధ్యవర్తి సంస్థలు కోర్టుకు తెలియజేశాయి. దీనిపై స్పందించిన హైకోర్టు, ప్రతివాదులుగా ఉన్న మధ్యవర్తులు వారం రోజుల్లో గావస్కర్ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. హక్కులు ఉల్లంఘించిన కంటెంట్‌కు సంబంధించిన స్పష్టమైన యూఆర్ఎల్లను 48 గంటల్లో న్యాయవాది ద్వారా సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!