

భారత మహిళల క్రికెట్ కెప్టెన్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమించినట్లు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆదివారం సంస్థ ప్రకటించింది. యుక్త వయసు బాలికల సాధికారత, ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు, వారు తమకు లభించే అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించడం ఆమె బాధ్యతల్లో భాగంగా ఉండనుంది. బాలికలకు సమాన హక్కులపై అవగాహన కల్పించడం, వారి భవిష్యత్తుకు బాటలు వేయడం వంటి కార్యక్రమాల్లోనూ స్మృతి భాగస్వామ్యం కానుంది.
యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపిక కావడం తనకు ఎంతో గౌరవంగా ఉందని స్మృతి మంధాన తెలిపింది. క్రికెటర్‌గా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతి కల ఒక అవకాశంతోనే ప్రారంభమవుతుందని పేర్కొంది. కఠోర శ్రమ, అంకితభావం, ప్రోత్సాహం తోడైతే ఆ అవకాశం జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని తెలిపింది. ప్రతి చిన్నారికి ఇలాంటి అవకాశాలు లభించాలని ఆకాంక్షించింది. మరోవైపు, యునిసెఫ్ దక్షిణాసియా ప్రాంతీయ సద్భావన రాయబారి సచిన్ తెందుల్కర్ స్మృతికి స్వాగతం పలికాడు. మైదానంలో లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన ఆమె, మైదానం వెలుపల కూడా బాలల హక్కుల కోసం తన గొంతును వినిపిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!