

డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు సైతం మహిళా రిజర్వేషన్ల అమలును అడ్డుకోలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ అధిగమిస్తామని భరోసా ఇచ్చారు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం దృఢంగా ఉందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఆ లక్ష్య సాధన కోసం తాను కూడా కృషి చేస్తున్నానని మోదీ తెలిపారు. దేశంలోని మహిళలందరి మద్దతు తమకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానాల సంఖ్యను 50 శాతం పెంచేలా డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడం మహిళలకు చట్టసభల్లో మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం పార్లమెంటులో 132వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళలకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. నారీ శక్తి వందన్ అభియాన్ చట్టం ద్వారా మహిళా రిజర్వేషన్ల అమలు త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అమిత్ షా పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!