

భారీ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ ప్రధాన గమ్యస్థానంగా ఎదుగుతోంది. స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో నగరంలో 11 డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఆ సంఖ్య 15కు చేరింది. దీంతో 36.4 శాతం వృద్ధి నమోదైంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ముంబయి 34 ప్రతిపాదిత కేంద్రాలతో మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. చెన్నై, పుణెల్లో తొమ్మిది చొప్పున, బెంగళూరు, దిల్లీల్లో ఐదు చొప్పున, కోల్‌కతాలో మూడు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే భారీ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది.
ప్రత్యేకంగా 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ల ఏర్పాటుపై నగరంలో ఆసక్తి పెరుగుతోంది. 2025లో ఈ విభాగంలో నాలుగు కేంద్రాల ప్రతిపాదనలు ఉండగా, ఈ ఏడాది సెప్టెంబరు నాటికి వాటి సంఖ్య ఎనిమిదికి చేరింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ సామర్థ్య విభాగానికి సంబంధించి ఉన్న 27 ప్రతిపాదనల్లో ఎనిమిది హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నగరంలో ప్రతిపాదిత 15 డేటా సెంటర్లలో 14 కేంద్రాలు 50 మెగావాట్లకు మించిన సామర్థ్యంతో ఏర్పాటు కానున్నాయి. అంటే మొత్తం ప్రతిపాదనల్లో 93.3 శాతం భారీ కేంద్రాలే. అయితే వీటి ఏర్పాటుకు నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, అనువైన స్థలాల లభ్యత కీలకం. ఈ మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంపైనే హైదరాబాద్‌లో డేటా సెంటర్ల రంగం భవిష్యత్తు వృద్ధి ఆధారపడి ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!