

దేశీయ ఐపీఓ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రీ-ఐపీఓ షేర్ల కొనుగోలు, విక్రయాల కోసం ప్రత్యేక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఈ అంశంపై త్వరలో సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలకు మాత్రమే ఈ వేదికను పరిమితం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్లకు ఈ సదుపాయాన్ని విస్తరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణ, ట్రేడింగ్‌లో పారదర్శకత పెంపు, కంపెనీల నుంచి మరింత సమాచారం వెల్లడించేలా నిబంధనల రూపకల్పనపై సెబీ దృష్టి సారించిందన్నారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందని, వేదిక ప్రారంభానికి సంబంధించి ఎలాంటి గడువును ఖరారు చేయలేదని పేర్కొన్నారు.
మరోవైపు, ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) వివరాలను ప్రచారం చేయవద్దని మార్కెట్ మధ్యవర్తులు, ఇతర భాగస్వాములను సెబీ కోరింది. ఐపీఓ ముగిసిన తర్వాత, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లు లిస్ట్ అయ్యేలోపు అనధికారికంగా జరిగే లావాదేవీల ఆధారంగా జీఎంపీని ప్రచారం చేయడం సరికాదని సూచించింది. షేర్ల లిస్టింగ్ ధర లేదా భవిష్యత్తులో వచ్చే లాభాలను అంచనా వేయడానికి జీఎంపీని ప్రామాణికంగా తీసుకోవద్దని పెట్టుబడిదారులను హెచ్చరించింది. గ్రే మార్కెట్ లావాదేవీలు అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజీల పరిధికి వెలుపల జరుగుతాయని, వాటిపై నియంత్రణ సంస్థల పర్యవేక్షణ ఉండదని, పెట్టుబడిదారులకు తగిన రక్షణ లభించదని వివరించింది. అందువల్ల ఇలాంటి ప్రీ-లిస్టింగ్ ప్రీమియం వివరాలను ప్రచురించడం, ప్రదర్శించడం, ప్రచారం చేయడం నిలిపివేయాలని సెబీ సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!