

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినళ్ల ద్వారా నగదు ఉపసంహరణలు, వాటికి సంబంధించిన ఛార్జీలపై సమగ్ర మార్గదర్శకాలను ప్రకటించింది. వీటి ప్రకారం.. పొదుపు ఖాతాదారులు తమ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో మూడు, మెట్రోయేతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. మెట్రో, మెట్రోయేతర ప్రాంతాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలను కలిపి ఉపయోగించినా నెలకు ఐదు ఉచిత లావాదేవీల పరిమితి వర్తిస్తుంది. నగదు ఉపసంహరణతో పాటు బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి సేవలూ ఈ లెక్కలోకి వస్తాయి. ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో అదనపు లావాదేవీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీ రూ.23కు మించకూడదు. దీనికి పన్నులు అదనం. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఒక్కో లావాదేవీ ద్వారా గరిష్ఠంగా రూ.10,000 మాత్రమే తీసుకోవచ్చు. హైదరాబాద్, ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులను మెట్రో నగరాలుగా పరిగణిస్తారు.
ఏటీఎంలో సాంకేతిక సమస్యలు, కనెక్టివిటీ లోపాలు, నగదు అందుబాటులో లేకపోవడం లేదా బ్యాంకు, సర్వీస్ ప్రొవైడర్ కారణంగా లావాదేవీ విఫలమైతే ఖాతాదారులపై ఛార్జీ విధించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అలాంటి లావాదేవీలను నెలవారీ ఉచిత పరిమితిలోనూ లెక్కించకూడదు. ఖాతాదారులు వినియోగించిన ఉచిత లావాదేవీల సంఖ్య, అదనపు ఛార్జీల వివరాలను బ్యాంకులు ఎస్‌ఎంఎస్ లేదా ఇతర మార్గాల్లో ముందుగానే తెలియజేయాలి. ఇక వ్యాపార సంస్థల వద్ద ఉన్న పీఓఎస్ టెర్మినళ్ల ద్వారా డెబిట్ కార్డులు, పూర్తి కేవైసీ కలిగిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్లు, యూపీఐ ఉపయోగించి ఒక్కో లావాదేవీలో గరిష్ఠంగా రూ.2,000 నగదు తీసుకోవచ్చు. ఈ విధానంలో నెలకు అన్ని ప్రాంతాలు కలిపి రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. వ్యాపార సంస్థలు వసూలు చేసే ఛార్జీ లావాదేవీ మొత్తంలో ఒక శాతానికి మించకూడదు. ఈ వివరాలను వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలి. వస్తువులు కొనుగోలు చేయకుండానే నగదు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కొనుగోలుతో పాటు నగదు తీసుకుంటే, రెండు మొత్తాలను రసీదులో విడివిడిగా చూపించాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!