

బంగ్లాదేశ్ స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ అతడి కెరీర్‌లో చివరిది కానుంది. మిర్పూర్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ వెల్లడించాడు. కొన్ని రోజుల క్రితమే ముష్ఫికర్ తనకు ఫోన్ చేసి రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలియజేశాడని, అప్పటి నుంచి అతడితో సంప్రదింపులు జరుపుతున్నానని తమీమ్ తెలిపాడు. స్వయంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించినప్పటికీ, తన తరఫునే ప్రకటన చేయాలని ముష్ఫికర్ కోరినట్లు వివరించాడు.
2005లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ముష్ఫికర్.. మూడు ఫార్మాట్లలోనూ బంగ్లాదేశ్ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2011 నుంచి 2017 వరకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ తరఫున 100కు పైగా టెస్టులు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 108 టెస్టుల్లో 7,062 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2006 ఆగస్టులో వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు.. 274 మ్యాచ్‌ల్లో 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. 102 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1,500 పరుగులు సాధించాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!