

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమె, ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఎంపికయ్యారు. దీంతో సింధు క్రీడాకారిణిగా కొనసాగుతూనే ప్రపంచ బ్యాడ్మింటన్ అత్యున్నత నిర్ణయాధికార వేదికలో ఓటు హక్కు కలిగిన సభ్యురాలిగా నిలిచారు.
ఇటీవల డెన్మార్క్‌లోని హార్సెన్స్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె తొలిసారి కౌన్సిల్ సభ్యురాలిగా హాజరయ్యారు. సింధు ఈ పదవిలోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల సమస్యలకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల ప్రైజ్ మనీ, అగ్రశ్రేణి ఆటగాళ్లపై టోర్నమెంట్ల ఒత్తిడి తగ్గించడం వంటి అంశాలపై ఆమె కృషి చేసే అవకాశముంది. వరుస టోర్నమెంట్ల కారణంగా గాయాలు పెరుగుతున్న నేపథ్యంలో, సింధు ప్రాతినిధ్యం ఆటగాళ్ల ప్రయోజనాల రక్షణలో కీలకంగా మారనుంది.
ఈ బాధ్యతపై స్పందించిన సింధు, బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల గళాన్ని బీడబ్ల్యూఎఫ్ వేదికపై వినిపిస్తానని, బ్యాడ్మింటన్ తనకు ఎంతో ఇచ్చిందని అన్నారు. ఈ క్రీడకు తన వంతు సేవ చేయడానికి అవకాశం రావడం సంతోషంగా ఉందని సింధు పేర్కొన్నారు. ఆమె అనుభవం బ్యాడ్మింటన్ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని బోర్డు సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!