

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ పోరులో పసికూన నేపాల్ అసాధారణ పోరాటంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. గెలుపు ముంగిట వరకు వెళ్లిన నేపాల్, చివరి బంతి వరకు పోరాడి కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తృటిలో చారిత్రక విజయాన్ని చేజార్చుకున్నా, ఇంగ్లీష్ జట్టుకు పట్టపగలే చుక్కలు చూపించి వణికించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హారీ బ్రూక్, జాకబ్ బెథల్ అర్ధ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధిస్తుందని భావించారు. అయితే నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. అనంతరం 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఏమాత్రం బెదరకుండా ఆడింది. కెప్టెన్ రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఐరీ బాధ్యతాయుతంగా ఆడగా, చివర్లో లోకేష్ బామ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 18 పరుగులు కావాల్సిన తరుణంలో, సామ్ కర్రన్ వేసిన బంతుల్ని ఎదుర్కోవడంలో నేపాల్ బ్యాటర్లు శ్రమించారు. చివరి బంతికి సిక్సర్ కొడితే విజయం వరిస్తుందన్న ఉత్కంఠ నెలకొనగా, ఇంగ్లాండ్ అనుభవం ముందు నేపాల్ తలవంచక తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో నేపాల్ 180 పరుగులు చేసి గౌరవప్రదమైన ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచినప్పటికీ, నైతికంగా నేపాల్ జట్టు చూపించిన తెగువకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇంగ్లాండ్ స్కోరు: 184/7 (హారీ బ్రూక్ 53, జాకబ్ బెథల్ 55)నేపాల్ స్కోరు: 180/6 (దీపేంద్ర సింగ్ ఐరీ 44, రోహిత్ పౌడెల్ 39, లోకేష్ బామ్ 39*)ఫలితం: ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!