

ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ నీరజ్ కుమార్ సత్తా చాటాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో 346.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాకు చెందిన దిమిత్రి పిమెనోవ్ 362.8 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా.. స్లొవేకియా షూటర్ ప్యాట్రిక్ జానీ 357.2 పాయింట్లతో రజతం దక్కించుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 323.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. నీరజ్ సాధించిన ఈ పతకంతో భారత్‌కు 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కోటా స్థానం లభించింది.
ఇదే ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం కూడా దక్కింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో నీరజ్ కుమార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత జట్టు 1,751 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. నీరజ్, అఖిల్ చెరో 582 పాయింట్లు సాధించగా.. ఐశ్వరీ 587 పాయింట్లు నమోదు చేశాడు. మరోవైపు ట్రాప్ ఈవెంట్‌లో ఉదయ్‌వీర్ సింగ్, వివాన్ కపూర్ ఫైనల్ బెర్తులపై ఆశలు నిలుపుకున్నారు. రెండో రోజు క్వాలిఫికేషన్ ముగిసే సమయానికి వీరు వరుసగా ఏడో, ఎనిమిదో స్థానాల్లో ఉన్నారు. టాప్-8లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈ పోటీ గురువారం ముగియనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!